భారత్‌లో మహిళల భద్రతపై కొందరిలో ఉన్న అనుమానాలు పటాపంచలు చేసేందుకు నడుంబిగించింది ఓ యువతి. ఒంటరిగా 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఆరువేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన యువతి.. మిగతా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తానని చెబుతోంది. ఆమే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశా మాలవీయ. 2022 నవంబరు 1న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించింది ఆశా. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళలో ఈ యాత్ర పూర్తయింది.
'సంపూర్ణ భారత్ యాత్ర' ద్వారా దేశంలో మహిళా భద్రత, సాధికారత గురించి సందేశమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది ఆశ. ఇప్పటి వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశానని తెలిపింది. తానొక పేద కుటుంబంలో జన్మించానని.. అక్క, తల్లితో కలిసి జీవిస్తున్నానని చెప్పింది.