madhya pradesh tunnel collapse: మధ్యప్రదేశ్, కట్ని జిల్లాలోని స్లిమ్నాబాద్లో నిర్మాణంలో ఉన్న బార్గీ కెనాల్ ప్రాజెక్ట్ సొరంగం కూలి శనివారం రాత్రి ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద సుమారు 9 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు. ఎస్డీఈఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలను వేగవంతం చేసినట్లు కట్ని కలెక్టర్ ప్రియాంక్ వివరించారు. రెస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ అడిషినల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్ రాజోరా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగినట్లు పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ సంఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడినట్లు చెప్పారు. బాధితులకు అవసరం అయిన చికిత్సను అందించాలని సూచించారు.