కొవిడ్ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళాలో పాల్గొని తిరిగొచ్చిన వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కుంభమేళాకు వెళ్లి వచ్చిన దిల్లీ వాసులు 14 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ విపత్తు నిర్వహణశాఖ ఆదేశించింది. ఈ మేరకు కుంభమేళాకు వెళ్లి వచ్చినవారు 24గంటల్లో తమకు వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తామని పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లో
కుంభమేళాలో పాల్గొన్న భక్తులను ఐసోలేషన్‌కి తరలించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 60వేలకుపైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనాను అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
గుజరాత్లో నెగెటివ్ తప్పనిసరి..
కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వీరిపై నిఘా ఉంచాలని.. స్వగ్రామాల్లోకి ప్రవేశించకుండా నాకాబందీ నిర్వహించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో పాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తో కలిసి గుజరాత్ జామ్‌నగర్‌లో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్షించారు.
కరోనా రోగుల చికిత్సకు గుజరాత్ వ్యాప్తంగా 25-30 వేల పడకలను అతి కొద్ది సమయంలోనే సమకూర్చినట్లు రూపానీ వెల్లడించారు.