పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు. ఏకంగా మూడు బావులను తవ్వి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. 'మౌంటేన్ మ్యాన్'గా గుర్తింపు పొందిన బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ గురించి వినే ఉంటారు. తన గ్రామం కోసం ఏకంగా ఎంతో ఎత్తున్న పర్వతాన్ని తొలగించి దారి వేశాడు. తాజాగా సీతారాం రాజ్‌పుత్ అనే వృద్ధుడు.. తన గ్రామ ప్రజల పంటల కోసం నీటి బావులను తవ్వి 'వెల్ మ్యాన్'గా అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
లక్ష్మణ్ చొరవతో ఆర్థిక సాయం..
మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలోని లవ్‌కుష్ నగర్‌కు చెందిన సీతారాం రాజ్‌పుత్ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను చూసిన సీతారాం.. బావులను తవ్వడం ప్రారంభించాడు. ఈయన గురించి తెలుసుకున్న స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. సంబంధిత అధికారులను సహాయం చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. లక్ష్మణ్ పోస్ట్‌కు స్పందించిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు రాజ్‌పుత్‌కు సహాయం అందించేందుకు గ్రామానికి చేరుకున్నారు.
ఆయన ఒక్కడే..
2018లో తన పొలంలో మొదటి బావిని తవ్వడం ప్రారంభించిన సీతారాం.. ప్రభుత్వం సాయం లేకుండానే 18 నెలల్లోనే పూర్తి చేశాడు. దీంతో బావి చుట్టుపక్కల పొలాలకు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు బావులు తవ్వాలని నిశ్చయించుకున్న రాజ్‌పుత్.. కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల సాయంతో మరో రెండు బావులను తవ్వాడు.