మధ్యప్రదేశ్ సాంస్కృతికశాఖ మంత్రి ఉషా ఠాకూర్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. తనతో సెల్ఫీ తీసుకోవాలంటే రూ.100 చెల్లించాలని చెప్పారు. సెల్ఫీలతో సమయం వృథా అవడం వల్ల నిర్దేశించిన కార్యక్రమాలకు సరైన సమయానికి చేరలేకపోతున్నందునే ఈ నియమం పెట్టినట్టు పేర్కొన్నారు. తనకు పుష్పగుచ్ఛం ఇచ్చే బదులు పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పుష్పాలలో లక్ష్మీదేవి ఉంటుందని, వాటిని విష్ణువు మాత్రమే స్వీకరిస్తారని అభిప్రాయపడ్డారు. అందువల్ల తనకు పుష్పాలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
"సెల్ఫీలతో నా సమయం వృథా అవుతోంది. కార్యక్రమాలకు ఆలస్యంగా వెళుతున్నాను. అందుకే సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే. ఆ డబ్బును నేరుగా మీ మండలంలోని భాజపా కేంద్రంలో జమచేయాలి. పార్టీ పనుల కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తారు. పుష్పగుచ్ఛాలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని నరేంద్ర మోదీ సైతం గతంలో చెప్పారు. పుష్పాలు తీసుకునేది కేవలం విష్ణువు మాత్రమే."
-ఉషా ఠాకూర్, మధ్యప్రదేశ్ మంత్రి