'అర్ధరాత్రి వేళ గ్రామాల మీద పడటం.. ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని లోపలకు వెళ్లడం.. దొరికింది దొరికినట్టు దోచుకుని, అవసరమైతే చంపేందుకు కూడా వెనుకడుగు వేయకపోవడం...' వింటుంటే.. ఇదేదో తమిళ సినిమా కథ చెబుతున్నారని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే మధ్యప్రదేశ్లోని గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సాగుతున్నది ఇదే. అయితే నేరాలకు పాల్పడుతున్న ఈ భయంకర ముఠా.. ఒక అడుగు ముందుకేసి.. గ్రామాల్లోని ప్రజల నుంచి "సేఫ్టీ ట్యాక్స్" వసూలు చేస్తోంది. అంటే.. తమను, తమ ఇళ్లను ఎవరూ దోచుకోకుండా ఉండటానికి అక్కడి ప్రజలు పన్నులు కడుతున్నారన్న మాట.
హడలెత్తిస్తున్న ముఠా..
కంజర్ల ముఠా పేరు వింటేనే మధ్యప్రదేశ్ ప్రజలు గడగడలాడిపోతారు. దోపిడీ, స్మగ్లింగ్, కిడ్నాప్లకు ఆ ముఠా పెట్టింది పేరు. రాజస్థాన్లోని చమెలా, పఠాన్ తదితర ప్రాంతాల్లో వీరి స్థావరాలు ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్లోని సరిహద్దు గ్రామాలపై వీరు విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా రత్లామ్ జిల్లాలోని అలోట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి ఆగడాలు దారుణంగా ఉంటాయి.
ఓవైపు కొన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తూనే.. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఓ వెసులుబాటు కల్పించారు ముఠా సభ్యులు. తమకు "సేఫ్టీ ట్యాక్స్" కట్టాలని.. అప్పుడు ఆ గ్రామం జోలికి రామని తేల్చిచెప్పారు. ఇక చేసేదేమీ లేక... గ్రామస్థులు పన్నులు కడుతున్నారు. పన్నులు వసూలు చేయడానికి ముఠా సభ్యులే స్వయంగా వస్తారు.
కొన్నికొన్ని సార్లు.. పన్నులు కట్టిన గ్రామాలపైనా దాడులు చేస్తారు నేరగాళ్లు. ఇవి జరిగిన కొన్ని రోజులకు.. వారు ఏర్పాటు చేసిన మధ్యవర్తులు వెళ్లి ముఠా దోచుకున్నది వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
ఇలా నిత్యం భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్టు 'ఈటీవీ భారత్'కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే రక్తం వచ్చేలా కొడతారని చెబుతున్నారు.
"100-150 గ్రామాల్లో వీరి ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి. మామూళ్లు ఇవ్వకపోతే ఇక అంతే! వాళ్ల పొలాలకు, ఇళ్లకు వెళ్లి కొడతారు. పొలాల్లో మోటర్లు ఎత్తుకెళతారు. ఇళ్లలోకి వెళ్లి వాహనాలు దొంగిలిస్తారు. మామూళ్లు ఇవ్వకపోతే గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తామని హెచ్చరిస్తారు."
--- మహేంద్ర ఠాకూర్, అలోట్ గ్రామస్థుడు