Madhya Pradesh Ganja: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి గ్వాలియర్-ఆగ్రా రోడ్డు మార్గంలో జరిపిన తనిఖీల్లో 662.5 కేజీల గంజాయి పట్టుబడింది. నీముచ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో గంజాయిని తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ట్రక్కు డ్రైవర్, అతని సహాయకుడు పరారీ ఉన్నట్లు వెల్లడించారు.
ట్రక్కు నుంచి మొత్తం 135 ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. వాహన తనీఖీలో నకిలీ నంబర్ ప్లేట్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మయన్మార్ సరిహద్దులో కూడా..
మణిపుర్‌లోని భారత్- మయన్మార్ సరిహద్దులో కూడా భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అసోం రైఫిల్స్ అధికారులు. వీటి విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్ సంతతికి చెందిన ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 54 కిలోల బ్రౌన్ షుగర్, 154 కిలోల మెథాఫెటమిన్లను సీజ్ చేశారు అధికారులు. భారతీయ యువత డ్రగ్స్‌కు బానిసలు కావడానికి ఈ అక్రమ రవాణే కారణమన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం పెరగడంలో ఈ డ్రగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు!