Madhya Pradesh Election Results 2023 in Telugu : మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. ప్రత్యర్థి కాంగ్రెస్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తొలుత అందరూ అనుకున్నారు. కానీ వాటిని తారుమారు చేస్తూ బీజేపీ ముందజలో దూసుకువెళ్తోంది. కాంగ్రెస్‌కన్నా రెట్టింపు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా అధికారంలోకి రావాలంటే 116 సీట్లు గెలుచుకోవడం అవసరం. ప్రస్తుతం.. అంతకన్నా చాలా ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరోమారు అధికారం ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ మిఠాయిలు పంచుకుంటూ, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. భోపాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది.
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, టీ9-భారత్ వర్ష్, దైనిక్ భాస్కర్ వంటి సంస్థలు బీజేపీకి 100-120 సీట్లు వస్తాయని తెలిపాయి. అయితే అంచనాకు మించి 150పైగా స్థానాలల్లో గెలుపొందింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 110-120 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ కనీసం బీజేపీకి పోటీని కూడా ఇవ్వలేక వెనుకంజలో ఉండిపోయింది.
ఆరోసారి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లీడింగ్
బుధ్ని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపు జెండా ఎగురవేసిన శివరాజ్ సింగ్ ఆరోసారి విజయం సాధించారు. ప్రజలు మరోసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో అన్నారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకుని ఓట్లు వేసి గెలిపించారని శివరాజ్‌సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. మేము తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు చేరుకున్నాయని.. మధ్యప్రదేశ్ ఒక కుటుంబంగా మారిందని సీఎం తెలిపారు. ప్రజలకు మాపే ఉన్న ప్రేమతో మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో మేజిక్- భారీ ఆధిక్యంలో బీజేపీ, కాంగ్రెస్ డీలా