Madhya Pradesh Election Result 2023 in Telugu :మధ్యప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారాన్ని నిలబెట్టుకుంది. అంచనాలకు మించిన ప్రదర్శనతో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. కౌంటింగ్ తొలి నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ ( MP Election Result 2023)మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. హస్తం, కమలం మధ్య హోరాహోరీ ఉంటుందని అంతా భావించినప్పటికీ- బీజేపీ డబుల్ఇంజిన్ పాలనకే ఓటర్లు జై కొట్టారు. కమలం పాలనను మెచ్చి మెజారిటీ కట్టబెట్టారు.
ఫలితం ఏకపక్షం
BJP Seats in Madhya Pradesh Election 2023 :రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే, హోరాహోరీ తప్పదని అంచనా వేశాయి. కానీ, తుది ఫలితం మాత్రం పూర్తి ఏకపక్షంగా వచ్చింది. కాంగ్రెస్‌ను చిత్తు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
పేద మహిళల అండతో!
2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా- జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో కలిశారు. దీంతో 2020లో రాష్ట్రంలో డబుల్ఇంజిన్ సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునే అనేక పథకాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది పేద మహిళలకు నగదు అందించే 'లాడ్లీ బహ్నా యోజన' పథకం ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మారింది.
దీంతో పాటు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. అంగన్వాడీ కార్మికులకు వేతనాలను రూ.10వేల నుంచి రూ.13 వేలకు పెంచుతామని ప్రకటించారు. రూ.9వేలుగా ఉన్న గ్రామ సహాయకుల వేతనాన్ని మూడు రెట్లు పెంచి రూ.18వేలకు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే గౌరవవేతనాన్ని మూడు రెట్లు చేస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఈ-స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవి బీజేపీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
మోదీ ఇమేజ్- డబుల్ఇంజిన్ సూపర్ హిట్!
రాష్ట్ర నాయకత్వం విషయంలో అనిశ్చితి నెలకొన్నా ఎన్నికల్లో డబుల్ఇంజిన్ వ్యూహంతో ముందుకుసాగింది కాషాయదళం. బీజేపీ అధినాయకత్వం మధ్యప్రదేశ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి 15 రోజుల ముందే 15 ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. మోదీకి ఉన్న జనాకర్షణ ఎన్నికల్లో బాగా పనిచేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ అభివృద్ధి అజెండా సైతం సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.