మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల మధ్య ముగిశాయి. 230 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 5 గంటల వరకు 74.31 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది.
రాజ్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగగా.. హస్తం పార్టీకి చెందిన ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సల్మాన్‌గా గుర్తించినట్లు ఛతర్‌పుర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ వాగ్బాణాలు సంధించుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరిగాయి. ఇందౌర్ జిల్లాలోని మహూ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఈ ఘనటలో ఐదుగురికి గాయాలయ్యాయి.
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిమనీ నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతమైన మొరేనాలోని సుమవాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలింగ్ సమయంలో ఒకే చోట కూర్చోబెట్టారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శైలేంద్ర సింగ్ చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తన సతీమణి, ఇద్దరు కుమారులతో కలిసి వెళ్లి జైత్ గ్రామంలో ఓటేశారు. అంతకుముందు ఆయన ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ప్రతిపక్ష నేత కమల్‌నాథ్.. తన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్, కోడలితో కలిసి శికార్‌పుర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భాజపా అధ్యక్షుడు VD శర్మ, భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్ర, మంత్రులు యశోధరరాజే సింధియా, రాజ్‌వర్దన్‌సింగ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జితుపట్వారీ, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి అనుపమ్ రాజన్ ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేశారు. కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్, ఆయన కుమారుడు జైవర్దన్‌సింగ్ తమ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి.. ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.