Madhya Pradesh Crime News: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లా షేక్పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. తన పొలంలో మొక్కను పీకేశాడన్న క్షణికావేశంలో ఏడేళ్ల బాలుడ్ని చంపేశాడు మరో 12 ఏళ్ల బాలుడు. ఈ ఘటన జనవరి 26న జరిగింది.
నిందితుడు తన వ్యవసాయక్షేత్రాన్ని పర్యవేక్షిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు మొక్కను పీకుతూ కనిపించాడు. దీంతో కోపంతో ఆ బాలుడ్ని కొట్టి వెళ్లిపోయాడు. ఆ దెబ్బలకు బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వచ్చి చూడగా సదరు బాలుడు స్పందించలేదు. అతడిని లేపేందుకు నిందితుడు యత్నించగా ఆ బాలుడు ఉలుకూపలుకూ లేదు. దీంతో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు నిందితుడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోస్ట్మార్టంలో బాలుడి గుండె ఆగి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.