Madhya Pradesh BJP Manifesto :మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు అధికార బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే క్వింటా వరిని 3,100 రూపాయలకు, క్వింటా గోధుములను 2,700 రూపాయలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొంది.
పీఎం ఉజ్వల, లాడ్లీ బహ్నా పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్‌ను 450 రూపాయలకు ఇస్తామని బీజేపీ తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తామని హామీనిచ్చింది. ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య విద్యాలయాలతో పాటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మధ్యప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఈ మ్యానిఫెస్టో రోడ్‌మ్యాప్ వంటిదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. భోపాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ.. సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ హామీలు ఇవే..
- వచ్చే ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచిత రేషన్.
- కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ కల్యాణ్ యోజన కింద ప్రతి రైతుకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం.
- ముఖ్యమంత్రి జన్ ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చి, పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం.
- లాడ్లీ బెహ్నా లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణం.
- 15 లక్షల మంది మహిళలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ.
- వీటితోపాటు ఆడపిల్లలకు యుక్తవయస్సు వచ్చే వరకు ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కొత్త పథకాల రూపకల్పన చేయనున్నట్లు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
ఆ ధైర్యం మోదీకే ఉంది!
మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో చొరబాటుదారులను అరికట్టగల ధైర్యం బీజేపీ ప్రభుత్వానికే ఉందని తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలకు అది సాధ్యం కాదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. అది రక్తపాతానికి దారితీస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు చేసినప్పటికీ అదేం జరగలేదని అమిత్ షా చెప్పారు. దేశ సంస్కృతిని కాంగ్రెస్ ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 2018 ఎన్నికల తర్వాత 15నెలల పాటు అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలను నిలిపేసిందని ఆరోపించారు.
- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
- ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3
మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఈటీవీ భారత్ అందించిన ప్రత్యేక కథనాలు..