Madhya Pradesh Assembly Election 2023 Counting : మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, అరగంట తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తామని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి అనుపమ్ రాజన్ తెలిపారు.
52 కేంద్రాల్లో కౌంటింగ్- 144 సెక్షన్ అమలు
మధ్యప్రదేశ్‌లోని మొత్తం 52 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని అనుపమ్ రాజన్ వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందని వివరించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీజేపీX కాంగ్రెస్
Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా, మెజార్టీ మార్క్-116. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. నవంబర్ 17వ తేదీన ఒకే విడతలో జరిగిన పోలింగ్లో 76.22 శాతం పోలింగ్ నమోదైంది. 956లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో 75.63 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.