తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2021, 8:01 AM IST

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: కుటుంబానికి దూరమై.. ఉరికంబానికి చేరువై!

స్వాతంత్య్రోద్యమంలో విప్లవకారులనగానే భగత్‌సింగ్‌(Bhagat singh) పేరు చెబుతారంతా! అలాంటి భగత్‌సింగ్‌కే స్ఫూర్తి ప్రదాత మదన్‌లాల్‌ ధింగ్రా!(Madan Lal Dhingra) కుటుంబం మొత్తం తనను వెలివేసినా దేశం కోసం ఉరికంబం ఎక్కిన సమర యోధుడు, దేశభక్తి అంటే ఇదంటూ చర్చిల్‌లాంటివారు(Winston Churchill) కితాబిచ్చిన వీరుడు ధింగ్రా.

Madan Lal Dhingra
మదన్‌లాల్‌ ధింగ్రా

అమృత్‌సర్‌లోని బాగా సంపన్న కుటుంబంలో 1883లో జన్మించాడు మదన్‌లాల్‌ ధింగ్రా(Madan Lal Dhingra). ఆయన తండ్రి డాక్టర్‌. బ్రిటిష్‌ ప్రభుత్వంలో మంచి పేరుంది. ఇంటర్మీడియెట్‌ దాకా అమృత్‌సర్‌లో చదివిన ధింగ్రా పైచదువుకు లాహోర్‌ వెళ్లాడు. అక్కడే జాతీయోద్యమంతో పాటు భారత పేదరికంతోనూ పరిచయమైంది. బ్రిటిష్‌ విధానాలు భారతీయులను ఎలా పీల్చిపిప్పి చేస్తున్నాయో అధ్యయనం చేశాడు ధింగ్రా! అదే సమయంలో.. బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకున్న బ్లేజర్‌ వేసుకునే కాలేజీకి రావాలంటూ ప్రిన్సిపల్‌ ఆదేశాలు జారీచేయటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

ఇంటికి కూడా వెళ్లకుండా..

సహచరులందరినీ పోగు చేసి ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో కాలేజీ నుంచి బహిష్కరించారు. తండ్రి దిత్తామల్‌ వచ్చి కాలేజీ యాజమాన్యానికి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ధింగ్రా(Madan Lal Dhingra) వినలేదు. ఇంటికి కూడా వెళ్లకుండా శిమ్లాలో, ముంబయిలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకు వెళ్లదీశాడు. ఈ సమయంలో పెద్దన్నయ్య డాక్టర్‌ బిహారీలాల్‌ పట్టుబట్టి ఒప్పించి ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ పంపించారు. లండన్‌ యూనివర్సిటీ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ధింగ్రాను చేర్పించారు. అక్కడే భారతీయ విద్యార్థులంతా కలిసే ఇండియా హౌస్‌లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, శ్యామాజీ కృష్ణవర్మలాంటివారితో పరిచయమై మళ్లీ దేశభక్తి, జాతీయోద్యమంవైపు ధింగ్రా(Madan Lal Dhingra) దృష్టి మళ్లింది. లండన్‌లోనే షూటింగ్‌ నేర్చుకున్నాడు కూడా! బెంగాల్‌ విభజనతో ఆయనలో తెల్లవారిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

మదన్‌లాల్‌ ధింగ్రా

జైలులో ఉరితీశారు..

ఓ రోజు బ్రిటిష్‌ ఉన్నతాధికారి కర్జన్‌ విల్లీని చంపటానికి పథకం రచించాడు. కర్జన్‌ భారత్‌లో ఉన్నత పదవుల్లో పనిచేసినప్పుడు తన తండ్రికి మంచి స్నేహితుడు కూడా! భారతీయ రైతులను పేదరికంలోకి నెట్టిన అనేక నిర్ణయాల్లో కర్జన్‌ భాగస్వామి. అందుకే ఆయన్ను చంపాలని ధింగ్రా(Madan Lal Dhingra) నిర్ణయించుకున్నారు. 1909 జులై 1న ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన విందుకు కర్జన్‌తో పాటు చాలామంది బ్రిటిష్‌ ప్రముఖులు హాజరయ్యారు. విందు ముగిసి వెళ్లిపోతుండగా ధింగ్రా దాడిచేసి కర్జన్‌ను కాల్చి చంపాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఓ పార్శీ డాక్టర్‌ కూడా చనిపోయారు. ధింగ్రాను అరెస్టు చేసి లండన్‌లోని సెంట్రల్‌ క్రిమినల్‌ కోర్టులో విచారణ జరిపారు. ఇక్కడ భారత్‌లో కుటుంబం ధింగ్రాను పూర్తిగా వెలివేసింది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వటం గమనార్హం! 1909 ఆగస్టు 17న 26 ఏళ్ల ధింగ్రాను లండన్‌కు సమీపంలోని జైలులో ఉరితీశారు. ఈ శిక్షను సమర్థించినా దేశభక్తి పేరిట చేసిన అద్భుత ప్రకటన అంటూ విన్‌స్టన్‌ చర్చిల్‌(Winston Churchill)(తర్వాత బ్రిటిష్‌ ప్రధాని అయ్యారు) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతికాలంలో భగత్‌సింగ్‌(Bhagat singh), చంద్రశేఖర్‌ ఆజాద్‌లకు ధింగ్రాయే స్ఫూర్తిదాయకుడిగా నిలిచాడు.

67 ఏళ్ల తర్వాత భారత్​కు..

ధింగ్రా(Madan Lal Dhingra) మృతదేహాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఖననం చేశారు. గమ్మత్తేమిటంటే- డయ్యర్‌ను చంపిన ఉధమ్‌సింగ్‌ అస్థికలకోసం వెతుకుతుంటే... ధింగ్రా అస్థికలు కూడా బయటపడ్డాయి. 67 సంవత్సరాల తర్వాత 1976లో అవి భారత్‌కు వచ్చాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా హాజరై వాటికి నివాళి అర్పించారు.

"జర్మనీ మీ బ్రిటన్‌ను ఆక్రమించుకొని దోచుకుంటే జర్మన్లతో పోరాడటం మీకు దేశభక్తి ఎలా అవుతుందో మా భారత్‌ను దోచుకుంటున్న మీతో పోరాడుతున్న మాదీ దేశభక్తే! మీరిక్కడికి తెస్తున్న ప్రతి పౌండ్‌ ఎంతోమంది భారతీయుల ప్రాణాలను తోడి తెస్తున్నది. బ్రిటన్‌ను ఆక్రమించుకునే హక్కు జర్మనీకి లేనట్లే... భారత్‌ను ఆక్రమించుకునే హక్కు మీ బ్రిటిషర్లకూ లేదు. దేశంకోసం రక్తం తప్పించి అర్పించటానికి నా వద్ద ఏమీ లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే లక్ష్యాన్ని (స్వాతంత్య్రం) సాధించేదాకా మళ్లీమళ్లీ భారత్‌లోనే పుడతా. చచ్చే ముందు మీ బ్రిటిష్‌ వారి ద్వంద్వనీతిని ప్రపంచానికి చాటడానికే ఈ ప్రకటన చేస్తున్నా"

- కోర్టులో ధింగ్రా

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details