దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్ కదమ్‌కు దివ్యాంగురాలైన తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది. రెండేళ్ల క్రితం వరకూ ఆ బాధ్యత చూసుకున్న ఆయన భార్య కూడా జబ్బుతో మంచాన పడడంతో ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రోబో లాంటి పరికరాన్ని తయారు చేస్తే అదే తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని భావించాడు.
దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన కదమ్‌కు సాంకేతికతపై ఎలాంటి అవగాహనా లేదు. అయినా తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతుందని భావించి ఏడాది క్రితం నుంచి రోబో లాంటి పరికరం కోసం అన్వేషించాడు. ఎక్కడా లభించకపోవడంతో తనకు తానే అలాంటి దానిని తయారు చేసేందుకు పూనుకున్నాడు. నిత్యం 12 గంటల పాటు ఇతర పనులు చేసుకొని ఆ తరవాత మిగిలిన సమయంలో సాఫ్ట్‌వేర్‌పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలలు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి 'మా రోబో' అని పేరు పెట్టాడు. పూర్తిగా వాయిస్ కమాండ్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.