Stalin News: తమిళనాట రహదారులపై ,రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారి ప్రాణాలను వెంటనే రక్షించాలన్న ఉద్ధేశంతో.. ప్రాణాలను కాపాడుదాం(ఇన్నుయిర్ కాప్పోమ్) పేరిట కొత్త పథకాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారిని రక్షించి వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చి వారి ప్రాణాలను రక్షించేలా 'ఇన్నుయిర్ కాప్పోమ్...నమైకాక్కుమ్-48' పథకం అందుబాటులోకి తెచ్చారు.
తొలి 48 గంటలు..
Scheme Nammai kakkum 48: పథకం కింద ప్రమాదం జరిగిన మొదటి 48గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేటు ఆస్పత్రులు సహా 610 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసి వాటి వివరాలను విడుదల చేసింది. ఇందులో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, ప్రధాన రహదారుల్లోని ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నా క్షతగాత్రులను వెంటనే చేర్పించి కాపాడేందుకు వీలు కల్పించారు. ఏ ప్రాంతానికి చెందిన వారైనా తమిళనాట రోడ్డు ప్రమాదానికి గురైతే పథకంలో భాగంగా తొలి 48గంటల పాటు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.