Lyca productions raid : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. కంపెనీకి చెందిన స్థలాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని త్యాగరాజనగర్, అడయార్, కారపక్కం సహా 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో సోదాలు చేపట్టిన్నట్లు సమాచారం. లైకా సీఈఓ తమిళకుమారన్ ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్లో ఉన్న సత్యదేవ్ అవెన్యూలోని తమిళకుమారన్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి దర్యాప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సోదాలపై లైకా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
లైకా సంస్థ నిర్మించిన 'పొన్నియిన్ సెల్వన్' సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు భారీగా కలెక్షన్లు కొల్లగొట్టాయి. దీనిపైనే ఈడీ అధికారులు ప్రధానంగా పరిశీలన చేపట్టినట్లు సమాచారం. నటీనటులకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అందులో ఏదైనా అక్రమ నగదు రవాణా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
లైకా సంస్థ ఈ మధ్య కాలంలో భారీ తారాగణంతోనే చిత్రాలు తెరకెక్కిస్తోంది. పెద్ద నటులతో హై బడ్జెట్ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్‌కు వచ్చిన ఆదాయం గురించీ ఈడీ ఆరా తీస్తోంది. భారత్ నుంచి విదేశాలకు జరిగిన లావాదేవీలపై కన్నేసింది. విదేశాల్లో ఆస్తుల అమ్మకాలు సైతం జరిగినట్లు సమాచారం.