LVM 3 Carrier Launched Success: ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. వన్‌వెబ్‌కు చెందిన 5.6 టన్నుల బరువున్న 36 ఉపగ్రహాలను LVM-3 వాహకనౌక నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. రెండో ప్రయోగ వేదిక నుంచి LVM-3 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది.
ఇప్పటికే ఇదే సంస్థకు చెందిన తొలి దఫా 36 ఉపగ్రహాలను... గతేడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకున్నారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్... 2 రోజుల ముందు నుంచే ఈ ప్రయోగాన్ని పర్యవేక్షణ చేశారు. పూర్తిగా వాణిజ్యపరంగా చేపట్టిన ఈ ప్రయోగానికి శనివారం ఉదయం 8గంటల 30 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా... 24.30 గంటల పాటు కొనసాగి ఈ ఉదయం 9 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఛైర్మన్:ఎల్‌వీఎం-3 వాహకనౌక ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. సిరీస్‌లోని మొదటి 16 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు సోమనాథ్ తెలిపారు. మిగతా ఉపగ్రహాలు విడిపోవడంపై ధ్రువీకరించాల్సి ఉందని వెల్లడించారు. ఎల్‌వీఎం-3 వాహకనౌక పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అవకాశం కల్పించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి వాహకనౌక సత్తా చాటిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.