గగన విహారం చేయడమే కాదు యుద్ధాల్లోనూ పోరాడగలమని ఎందరో వనితలు ముందుకొస్తున్నారు. మన దేశ సరిహద్దులు పహారా కాయడం దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపేంత వరకు అన్నీ చేయగలమని అంటున్న ఈ శివంగులు. ఎంతో కఠినమైన శిక్షణను సైతం ఎదుర్కొని విజయాన్ని ముద్దాడుతున్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకున్న ఓ యువ కెరటం ఇప్పుడు ఫైటర్ పైలట్‌గా మారుతోంది. తనే పంజాబ్‌కు చెందిన అన్షికా యాదవ్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ ప్రాంతానికి చెందిన అన్షిక కుటుంబం.. దాదాపు 15 ఏళ్లుగా లూథియానాలో నివసిస్తోంది.
పంజాబ్‌లోని లూథియానాకు చెందిన డాక్టర్ డీఎన్ యాదవ్, పూజా యాదవ్ కుమార్తె అన్షికా యాదవ్. అన్షిక చిన్నప్పుడే ఫైటర్ పైలట్ కావాలని నిశ్చయించుకుంది. తొమ్మిదో తరగతి నుంచే తన లక్ష్యం కోసం శిక్షణ ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి అన్షిక చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండేది. చివరకు అనుకున్న లక్ష్యం సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
అన్షిక విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న కుటుంబసభ్యులు "అన్షిక అన్ని రంగాల్లోనూ ముందుంటుంది. చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణిస్తుంది. ఆమె జాతీయ స్థాయి స్మిమ్మర్. ఈ రంగంలో చాలా పతకాలు సాధించింది. తన అనుకున్న లక్ష్యం కోసం శ్రమించి.. జాతీయస్థాయిలో 17వ ర్యాంకు సాధించింది. అన్షిక ప్రస్తుతం పుణెలోని ఖడక్వాస్లాలోని శిక్షణా కేంద్రంలో చేరింది. రాబోయే మూడేళ్లపాటు అక్కడే ఉంటుంది. ఫ్లయింగ్ వింగ్‌లో మహిళలకు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో అన్షిక మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అన్షిక సాధించిన విజయం వెనుక ఆమె తల్లి ముఖ్యపాత్ర పోషించింది."
--డాక్టర్ డీఎన్ యాదవ్, అన్షిక తండ్రి
"అన్షిక సాధించిన విజయం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. దేశంలోని ప్రతి అమ్మాయి తమ కలలను సాధించడానికి అన్షిక ప్రేరణగా నిలిచింది. శిక్షణ సమయంలో అన్షికకు ఫోన్ అనుమతి ఉండదు. మేము వారానికి ఒకసారి మాత్రమే మాట్లాడగలం. కానీ, ఈ రంగంలో పూర్తి విజయం సాధించడానికి ఆమె తన భయాలను జయించవలసి ఉంటుంది. దేశానికి సేవ చేసే అవకాశం అన్షికకు రావడం అదృష్టం".
--పూజా యాదవ్, అన్షిక తల్లి
"ఈ రోజుల్లో అమ్మాయిలు దాదాపు అన్ని రంగాల్లో అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నారు. కష్టతరమైన పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా అన్షిక క్యాంపస్ మొత్తం గర్వపడేలా చేసింది. దీనికి విజ్ఞానమే కాదు శారీరక దృఢత్వం కూడా అవసరం. ఉన్న రెండు స్థానాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అన్షిక.. ఇది మనందరికీ గర్వకారణం."
--డాక్టర్ నచికేత్ కొట్వాలివాలే, ఐసీఏఆర్ డైరెక్టర్
స్విమ్మింగ్‌లో అన్షిక సాధించిన పతకాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో.. పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు ఉన్నాయి. అందులో మహిళలకు 19 సీట్లు మాత్రమే కేటాయించారు. అందులో రెండు సీట్లు ఫైటర్ పైలట్‌లకు రిజర్వ్ చేశారు. ఈ రెండు సీట్లలో అన్షిక తన ప్రతిభతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతరం డిసెంబర్ 27న నుంచి పుణెలోని అకాడమిలో శిక్షణ పొందుతోంది. ఆమె సాధించిన విజయం పట్ల కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండో స్థానంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా ఎన్నికైంది. సానియా ఎన్డీఏలో 149వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. సానియా కూడా అన్షికతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందుతుంది. సానియా దేశంలోనే తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా చరిత్రకెక్కనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తొలి మహిళా పైలట్ కూడా ఆమే కానుండడం విశేషం. సానియా మీర్జా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.