Ludhiana court blast: పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి డిస్మస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్‌కార్డు, వైర్లెస్ డాంగిల్‌ను స్వాధీనం చేసుకుని, సిమ్ ఆధారంగా గగన్‌దీప్‌ను గుర్తించారు. అయితే, తనపై నమోదైన డ్రగ్స్ కేసులో రికార్డులను నాశనం చేసేందుకే గగన్‌దీప్ ఈ పేలుడుకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్‌దీప్‌ను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 2019లో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రెండేళ్ల పాటు జైల్లో ఉన్న గగన్‌దీప్.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు ఈ కుట్ర పన్నినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేసుకు సంబంధించిన పేపర్లను భద్రపరిచే కోర్టు రికార్డు గదిని బాంబుతో పేల్చేయాలని ప్రణాళిక చేసుకున్న గగన్‌దీప్.. మూత్రశాలలో బాంబును అమర్చుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది.
దాడి వెనక వారి హస్తం..
లుథియానా కోర్టు పేలుడు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ. బాంబును బిగించి మరో ప్రాంతంలో అమర్చేందుకే వాష్‌రూమ్‌లోకి మాజీ హెడ్ కానిస్టేబుల్ వెళ్లినట్లు తెలిసిందన్నారు. బాంబు పేలిపోయినప్పుడు గగన్‌దీప్ ఒక్కడే మూత్రశాలలో ఉన్నాడని తెలిపారు. దీనితో ఖలిస్థానీ ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్లు, మాఫియాకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు.