తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.8.5 కోట్లు చోరీ.. రూ.10 కూల్​డ్రింక్ కోసం కక్కుర్తి.. దొరికిపోయిన గజదొంగలు - ludhiana bank heist

Ludhiana Cash Van Robbery : రూ. 8.5 కోట్లు దోచుకొన్న ఓ దొంగ జంట.. ఉచితంగా ఇచ్చే కూల్​డ్రింక్​కు ఆశపడి కటకటాల పాలయ్యింది. వారికి ఉచితంగా కూల్​డ్రింక్ ఇచ్చిందెవరు? అంత డబ్బు దొంగిలించనవారు 'ఫ్రీ'గా ఇచ్చే కూల్​డ్రింక్ కోసం ఎందుకు ఆశపడ్డారు? అనే సందేహాలున్నాయా?. అయితే ఈ కథనం మీకోసమే.

Ludhiana Robbery Case
Ludhiana Robbery Case

By

Published : Jun 19, 2023, 2:57 PM IST

Ludhiana Cash Van Robbery : సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగుకాల్వలో పడిపోయినట్లుంది ఓ గజదొంగదంపతుల పరిస్థితి. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని పారిపోయారు పంజాబ్​కు చెందిన భార్యాభర్తలు. కానీ రూ.10 కూల్‌డ్రింక్‌ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Mandeep Kaur Ludhiana : పంజాబ్‌లోని లూథియానాలో జూన్​ 10న సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ అనే సంస్థలో రూ.8.49 కోట్ల విలువైన సొమ్మును 'డాకూ హసీ'గా పేరున్న మన్‌దీప్‌ కౌర్‌ దోచుకొంది. దీంతో పంజాబ్​ పోలీసులకు ఈ దోపీడి కేసు సవాలుగా మారింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన భర్త జస్వీందర్ సింగ్​తో కలిసి నేపాల్​కు బయలుదేరింది మన్​దీప్​ కౌర్​. దోపిడి విజయవంతమైనందుకు పనిలో పనిగా.. మార్గమధ్యంలో పుణ్యక్షేత్రాలు చూసి పోదామని మన్​దీప్ కౌర్ అనుకుంది. మరోవైపు పోలీసులు దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. మన్​దీప్​ సహచరుడు గౌరవ్‌ను అరెస్టు చేసి.. అతడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన 12 మందిలో 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు పట్టుబడిన మన్​దీప్, జస్వీందర్ సింగ్

రూ. 10 కూల్​డ్రింక్ కోసం కక్కుర్తి పడి..
మన్‌దీప్‌-జస్వీందర్‌ దంపతులు నేపాల్‌ వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో వారు హరిద్వార్‌, కేదార్‌నాథ్‌, హేమ్‌కుండ్‌ సాహెబ్‌ క్షేత్రాలను దర్శించనున్నట్లు దర్యాప్తు అధికారులకు తెలిసింది. హేమ్‌కుండ్‌ సాహెబ్‌కు నిత్యం వేలాది మంది సిక్కు యాత్రికులు వస్తుంటారు. వీరిలో మన్​దీప్​ కౌర్​ను​ గుర్తించడం చాలా కష్టం. దీంతో యాత్రికులకు ఉచితంగా కూల్​డ్రింక్‌ పంపిణీ ప్రణాళికను పోలీసులు అమలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఊహించినట్లుగానే ఉచిత డ్రింకును తీసుకోవడానికి మన్‌దీప్‌ జంట ఆ స్టాల్‌ వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లే సమయానికి ఈ జంట తమ ముఖాలు కనిపించకుండా కవర్‌ చేసుకున్నారు. కానీ, కూల్​డ్రింక్‌ తాగేందుకు వారు ముఖంపై ఉన్న వస్త్రాన్ని తొలగించడం వల్ల పోలీసులు వారిని గుర్తించారు. అయినా.. ఏమీ తెలియనట్లు పోలీసులు మన్​దీప్ కౌర్ దంపతులు ఎదుట నటించారు. హేమ్‌కుండ్‌ సాహెబ్‌లో మన్​దీప్ కౌర్ దంపతులు ప్రార్థనలు చేసుకుని.. బయటకు వచ్చాక వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌కు పోలీసులు 'లెట్స్‌ క్యాచ్‌ క్వీన్‌ బీ' (రాణీ తేనెటీగను పట్టుకొందాం) అని పేరు పెట్టారు. మన్‌దీప్‌ వద్ద నుంచి రూ.12 లక్షల నగదు, ఓ బైక్​, ఆమె భర్త జస్వీందర్‌ సింగ్‌ నుంచి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు.

గతంలో బీమా ఏజెంట్‌గా పనిచేసిన మన్‌దీప్‌ కౌర్​.. భారీగా అప్పులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్వీందర్‌ను వివాహం చేసుకుంది. ధనవంతురాలిగా మారుదామనే ఉద్దేశంతోనే ఆమె సీఎంఎస్‌ సంస్థలో ఉద్యోగులను బందీలుగా చేసుకొని ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు తెలిపారు. సీఎంఎస్ సంస్థ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details