Ludhiana Bomb Blast: పంజాబ్‌లోని లుథియానా కోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మృతుడు.. 2019లో డిస్మిస్ అయిన పంజాబ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా శుక్రవారం గుర్తించారు. లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్‌దీప్ డ్రగ్స్ కేసులో డిస్మిస్ అయ్యారు. ఈయనను గుర్తించడంలో మొబైల్ సిమ్‌కార్డు పోలీసులకు ఉపయోగపడింది.
కాగా, ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ అంతకుముందు వెల్లడించారు. బాంబు పేలిన ప్రాంతాన్ని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు పరిశీలించారు.
ఇదీ జరిగింది..
పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. రెండో అంతస్తులో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 11 గంటలకు రెండో అంతస్తులోని కోర్టు నంబరు 14 సమీపంలో శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు శిథిలాలు.. ఎగురుకుంటూ వచ్చి కింద ఉన్న వాహనాలపై పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు కోర్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుడు కారణాలేమిటని ఆరా తీశారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో గాలించారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.