Blast in court complex Ludhiana: పంజాబ్‌లోని లుథియానా జిల్లా, సెషన్స్ కోర్టు సముదాయంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు కలకలం సృష్టించింది. కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో ఉన్న మూత్రశాలలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో జరిగిన పేలుడు ధాటికి కోర్టు భవనంలో రెండో అంతస్తు దెబ్బతింది. వాష్‌రూమ్ సమీపంలోని గదుల్లో అద్దాలు పగిలిపోయాయి. గోడ శిథిలాలు కింద ఉన్న వాహనాలపై పడి ధ్వంసమయ్యాయి.
లుథియానా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అతి సమీపంలోనే.. ఈ జిల్లా కోర్టుల సముదాయం ఉంది. పేలుడు జరిగిన వెంటనే.. న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధించిన పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని లుథియానా పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లారు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి నమూనాలు సేకరిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో దుర్మరణం చెందిన వ్యక్తిపైనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు భుల్లార్. మానవ బాంబుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. బాంబు పేలిన ప్రాంతానికి అతి దగ్గరలో మృతదేహం లభించటమే అందుకు కారణంగా భావిస్తున్నామన్నారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు.
కోర్టులోని మూత్రశాలల్లో బాంబు పెట్టినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కోర్టులోని సెన్సార్లు, ఇతర భద్రతా పరికరాలు పనిచేయటం లేదన్నారు.
ఘటనా స్థలానికి ఎన్ఐఏ..
పేలుడు జరిగిన క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన రెండు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ కేసును ఎన్ఐఏనే చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని అధికారవర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల పనేనా?
లుథియానా కోర్టు సముదాయంలో పేలుడుతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం అయినందున.. బయటి శక్తుల ప్రమేయం ఉందనే వాదనను తోసిపుచ్చలేమన్నారు ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధవా. భద్రతను కట్టుదిట్టం చేశామని.. రాష్ట్రం మొత్తం హైఅలర్ట్‌లో ఉందని చెప్పారు.
నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ..
లుథియానాలోని కోర్టు సముదాయాల్లో భారీ పేలుడుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం హోంశాఖ. వీలైనంత త్వరగా పూర్తి సమాచారంతో నివేదిక పంపాలని స్పష్టం చేసింది. అలాగే.. ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, పేలుడుకు పాల్పడే అవకాశం ఉన్న వారి వివరాలనూ సమర్పించాలని కోరింది.