శ్రీలంక అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. శ్రీలంక తమిళులకు విముక్తి కల్పించేందుకు ఆయన త్వరలోనే బయటకొస్తారని అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది మాత్రం తాను చెప్పనని, ప్రభాకరన్ కుటుంబంతో తాను ఇప్పటికీ మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రభాకరన్ బతికున్నారన్న విషయాన్ని ఆయన అనుమతితోనే బహిరంగంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీలంకలో రాజపక్సే కుటుంబం గద్దె దిగడం వల్ల బయటకు వచ్చేందుకు ఇదే సరైన సమయమని ప్రభాకరన్ భావిస్తున్నారని అన్నారు. తమిళ్ ఈలానికి చెందిన ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఆయన త్వరలోనే తన ప్రణాళికలను వెల్లడిస్తారని తెలిపారు.
'LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు.. వారి కోసం త్వరలోనే వస్తారు!'.. నిజం కాదన్న శ్రీలంక - శ్రీలంక ప్రభాకరన్
శ్రీలంకలో తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించిన ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన బతికే ఉన్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పళ నెడుమారన్ చెప్పడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు లంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రభాకరన్‌ను 2009లో లంక సైన్యం మట్టుబెట్టింది. నెడుమారన్ ప్రకటనపై స్పందించిన శ్రీలంక సైన్యం అందులో నిజం లేదని తెలిపింది.
నెడుమారన్ చేసిన సంచలన వ్యాఖ్యలను శ్రీలంక సైన్యం కొట్టిపారేసింది. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్‌తో సహా అన్ని ఆధారాలు శ్రీలంక వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరత్ తెలిపారు. ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు తీసుకనే ప్రణాళికలు లేవని ఆయన పేర్కొన్నారు. నివేదికలను పరిశీలించిన తర్వాత దీనిపై స్పందిస్తామని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు.
2009లో శ్రీలంక ప్రభుత్వం జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకరన్‌ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంబంధించిన చిత్రాలు అప్పట్లో ప్రచురితమయ్యాయి. డీఎన్‌ఏ పరీక్షలతో సైతం ప్రభాకరన్ మరణాన్ని ధ్రువీకరించినట్లు తెలిపింది. అయితే ఎల్టీటీఈని రూపుమాపే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అప్పట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరణించిన సమయంలో ప్రభాకరన్ వయస్సు 54 ఏళ్లు. అతడు మరణించిన దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ తరహా ప్రకటన రావడం గమనార్హం.
గతంలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ను నెడుమారన్ చాలాసార్లు కలిశారు. శ్రీలంకలో అణచివేతకు గురవుతున్న తమిళులకు స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ఎల్టీటీఈని.. 1976లో ప్రభాకరన్ స్థాపించారు.