LPU Chancellor Met Modi : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీఛాన్స్లర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిత్తల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మిత్తల్.. మోదీ ఎల్పీయూ పర్యటన గురించి ప్రస్తావించారు. 2019లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా మోదీ ఎల్పీయూకు వచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలోనే శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'జై అనుసంధాన్' నినాదాన్ని ఇచ్చారని తెలిపారు.
మోదీతో సమావేశంలో భాగంగా ఉన్నత విద్యలో పరిశోధనలు, ఆవిష్కరణల ఆవశ్యకత గురించి డాక్టర్ మిత్తల్ తన అభిప్రాయాలు వెల్లడించారు. పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాలని డాక్టర్ మిత్తల్ పేర్కొన్నారు. ఆర్థిక పురోగమనానికి, అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. తమ యూనివర్సిటీ విద్యార్థులకు నిజజీవితానికి అవసరమయ్యే విద్యను అందించడమే కాకుండా మెరుగైన శిక్షణ ఇస్తూ జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ విజయానికి తమవంతు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు చెప్పారు.
విద్యారంగానికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన విద్యావిధానం తీసుకొచ్చేందుకు చొరవ చూపినందుకు అభినందనలు తెలిపారు. నూతన విద్యా విధానం అమలుకు సంబంధించి ఎల్పీయూకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంటామని డాక్టర్ మిత్తల్ ప్రధాని మోదీతో పేర్కొన్నారు.