తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AI Technology: ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Loyola College Students AI Technology: కృత్రిమ మేధస్సు.. ప్రస్తుతం మనిషి మేధస్సుతో పోటీపడుతూ.. అన్నిరంగాల్లో ఆధిక్యత చాటుకుంటోంది. ఈ సాంకేతికత అర్థం చేసుకుని ప్రతిభకు సానబెడుతూ వినూత్నంగా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. AI సహాయంతో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి పరిష్కారం చూపుతున్నారు. మరి, ఆ ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఆవిష్కరణల ప్రాజెక్టులు ఏమిటి? సమాజానికి అవి ఎలా ఉపయోగపడున్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ai technology
ai technology

By

Published : Aug 4, 2023, 2:38 PM IST

ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Loyola College Students AI Technology: నవీన సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు.. మనిషి మేధస్సుతో పోటీపడుతూ.. అన్ని రంగాల్లో ఆధిక్యతను చాటుకుంటోంది. తాజాగా ఏఐ సహాయంతో సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆరోగ్య సమస్యల నుంచి పంట పొలాల్లో రైతులు ఎదుర్కొనే చీడపురుగుల ఇబ్బందుల వరకు అన్నింటీపై అధ్యయనం చేసి.. పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. అందరి మన్ననలతో పాటు తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సాధారణంగా ఇంజినీరింగ్‌ అంటేనే ఆవిష్కరణలకు అడ్డా. అందుకు కళాశాల నుంచి ప్రోత్సాహం లభిస్తే.. విద్యార్థులు, వారి మేధస్సుకు పదును పెడుతూ.. వినూత్న ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తారు. తమ కళాశాలలో కూడా ఇదే జరిగిందంటున్నారు.. విజయవాడ లయోలా కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

సర్వేద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలాంటి కంటికి సమస్య వస్తే చాలా భయపడిపోతాం. ఎంతశాతం చూపు ఉందని తెలుసుకోవాలని వైద్యుల్ని సంప్రదిస్తుంటాం. పలు రకాల పరీక్షలు చేసుకుంటాం. అయితే ఈ విద్యార్థులు రూపొందించిన ఏఐ వెబ్‌సైట్‌ ద్వారా అదంతా ఏమి ఉండదని చెబుతున్నారు. కన్ను ఫొటో తీసి సైట్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. చూపు ఎంత శాతం పనిచేస్తుందో చెప్పేస్తుందని విద్యార్థులు అంటున్నారు.

కంటికి సంబంధించి వచ్చే పలు రకాల జబ్బుల వివరాలు విద్యార్థులు సేకరించారు. కంటి పొరలు ఎలా ఉంటే ఏ సమస్య ఉందో అనే డేటా వెబ్‌సైట్ అప్‌లోడ్ చేస్తున్నారు. కృత్రిమ మేధతో తయారు చేసిన వీరి సైట్ ద్వారా కంటి ఫొటోలు అప్‌లోడ్ చేయగానే వివరాలను పంపిస్తుంది. త్వరలో ఈ యాప్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

ఆరుగాలం కష్టించి పండించే పంటను పురుగులు దెబ్బతీస్తోన్నాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఘటనలు చూసిన విద్యార్థులు రైతులకు బాసటగా నిలవాలనుకున్నారు. అందుకోసం వీరంతా కలిసి చీడపురుగుల డేటా సేకరించారు. తర్వాత ఏఐ సహాయంతో పని చేసే వెబ్‌సైట్‌ రూపొందించారు. సమస్య ఉన్న ఆకు ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే చాలు.. ఏ వ్యాధి సోకిందో వివరాలు అందించేలా ఈ సైట్‌ను క్రియేట్‌ చేశారు.

మరికొంతమంది విద్యార్థులు ఆర్థోకు సంబంధించిన అంశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రీసెర్చ్‌ చేస్తున్నారు. ఎముకలు విరిగితే వైద్యులు గుర్తించలేని అతిచిన్న పగుళ్లను సైతం పసిగట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారని కళాశాల డైరెక్టర్ చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు ఉపయోగపడే వెబ్‌సైట్స్‌, యాప్‌లు విద్యార్థులు రూపొందించటం చాలా సంతోషంగా ఉందంటున్నాడు .

భవిష్యత్‌లో కృత్రిమ మేధ అన్ని రంగాల్లో తనదైన ముద్రవేస్తుంది. అందువల్లే మేము ఈ సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని.. త్వరలో వీటికి పూర్తి స్థాయి రూపం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తోన్నారు. కళాశాల, అధ్యాపకుల ప్రోత్సాహంతో మరింన్ని ఆవిష్కరణలకు సైతం బీజం వేస్తామని నమ్మకంగా చెబుతున్నారు ఈ ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details