కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సౌమ్య(23) ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. విషం తాగిన నిందితుడు సుబ్రమణ్య.. దేవనహళ్లిలోని ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
హత్యకు గురైన సౌమ్య, నిందితుడు సుబ్రమణ్య బెంగళూరులోని ఓ కాఫీ డేలో పనిచేసేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్ని నెలల క్రితం సుబ్రమణ్య ఉద్యోగం మానేశాడు. అనంతరం అతడిని సౌమ్య దూరం పెట్టింది. 15 రోజుల క్రితం సౌమ్యకు.. వేరే యువకుడితో వివాహమైంది. తాను ప్రేమించిన సౌమ్య వేరే అబ్బాయిని పెళ్లిచేసుకుందని సుబ్రమణ్య ఆమెపై పగ పెంచుకున్నాడు.
బాధితురాలు సౌమ్య తన పుట్టింటివారి ఇంటికి వచ్చిందని నిందితుడికి తెలిసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి సౌమ్య ఇంటికి వెళ్లి కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు. సౌమ్య కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై విజయపుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.