ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత ఘటన వెలుగుచూసింది. ఇద్దరమ్మాయిలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని.. ప్రతిజ్ఞ చేసుకుని కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారిలో ఓ అమ్మాయి.. లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. అబ్బాయిగా మారిన అనంతరం ఆమెతో కలిసుండడానికి నిరాకరించింది. దీంతో లింగమార్పిడి చేసుకున్న యువతి కోర్టును ఆశ్రయించింది.
ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. రూ.6 లక్షలతో లింగమార్పిడి.. కట్ చేస్తే ప్రేయసి మరో ట్విస్ట్
సాధారణంగా పెళ్లి అంటే ఎవరికైనా చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయే గుర్తుకువస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటుగా అబ్బాయిలు, అమ్మాయిల మనస్తత్వాలు కూడా మారుతున్నాయి. దీంతో లెస్బియన్ వివాహాలు జరుగతున్నాయి. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం యూపీలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక అమ్మాయి.. లింగమార్పిడి చేసుకుంది. కానీ అబ్బాయిగా మారాక ఆ అమ్మాయి.. అతడ్ని దూరం పెట్టింది. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.
అసలేంటీ ఈ ఇద్దరమ్మాయిల కథ..?
ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ జీవితాంతం కలిసుంటామని ప్రతిజ్ఞ చేసుకుని.. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జీవించారు. కలిసి జీవించాలంటే ఇద్దరిలో ఒకరు మగవాడిగా ఉండాల్సిందేనని సోనాల్.. సనా ఖాన్‌కు చెప్పింది. దీంతో సనా ఖాన్ దిల్లీలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారింది. తన పేరును కూడా సుహైల్ ఖాన్‌గా మార్చుకుంది. అయితే అదే సమయంలో సోనాల్ శ్రీవాత్సవకు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత నుంచి సోనాల్.. సనా ఖాన్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయితే సనా తన ప్రియురాలిని ఎన్నిసార్లు ప్రాధేయపడినా సరే ఆమె హృదయం చలించలేదు. కాగా, 'నేను నీతో కలిసి జీవించలేను. అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లి మళ్లీ అమ్మాయిగా మారు' అని సోనాల్‌తో చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సనా ఖాన్ అలియాస్ సుహైల్ ఖాన్ కోర్టును ఆశ్రయించింది.
ఈ విషయంపై సనా ఖాన్ మే 30, 2022లో ఆన్లైన్ ద్వారా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జూన్ 3వ తేదీన కోర్టులో దావా వేసింది. సనా తో పాటుగా మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా
ఆదేశిస్తూ.. కోర్టు సోనాల్‌కు నోటీసులు పంపింది. అయితే సోనాల్ ఆ నోటీసులు స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. పోలీసులు జనవరి 18న సోనాల్‌ను అరెస్ట్ చేసి.. జనవరి 19న తేదీన కోర్టులో హాజరుపరిచారు. కాగా, అదే రోజు సోనాల్‌కు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఆ సర్జరీ కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్లు సనా ఖాన్ తెలిపింది.