Loudspeakers Maharashtra: మతపరమైన ప్రార్థనల సమయంలో లౌడ్స్పీకర్లు పెట్టటం వల్ల గందరగోళం నెలకొని శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ మహారాష్ట్రలోని నాశిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్(నమాజ్)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్ చాలీసా, భజన వంటివి లౌడ్స్పీకర్లలో ప్లే చేయకూడదని ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.
"హనుమాన్ చాలీసా, భజనలు స్పీకర్లలో ప్లే చేసేందుకు అనుమతులు తీసుకోవాలి. ఆజాన్కు 15 నిమిషాల ముందు నుంచి ఆ తర్వాత 15 నిమిషాల వరకు ఎలాంటి అనుమతులు లేవు. అలాగే.. మసీదుకు 100 మీటర్ల పరిధిలో స్పీకర్లకు అనుమతి లేదు. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం."
- దీపక్ పాండే, సీపీ, నాశిక్.
మే 3లోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు సీపీ. మే 3 తర్వాత ఎవరైనా అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. మరోవైపు.. నమాజ్ కోసం మసీదుల్లో లౌడ్స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్ చాలీసా, భజనలతో లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్స్పీకర్లో హనుమాన్ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్ఎస్ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్ చేశారు పోలీసులు.
రెండ్రోజుల్లో కొత్త మార్గదర్శకాలు: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లను ఉపయోగించే విషయంపై రాష్ట్ర డీజీపీ, ముంబయి పోలీస్ కమిషనర్ మార్గదర్శకాలను రూపొందిస్తున్నారని.. రెండ్రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్షే తెలిపారు. లౌడ్స్పీకర్ల విషయంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి దిలీప్ వాల్షే పలుమార్లు సమావేశమై చర్చించారు. కోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు పెట్టకూడదని, ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు.
ఇదీ చూడండి:దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి
మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం