Lord Shiva Gets Notice: "మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్‌గఢ్ రెవెన్యూ కోడ్-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు."... సాక్షాత్తూ మహాశివుడికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసుల సారాంశం ఇది. శివుడితోపాటు దాదాపు 10 మందికి ఇదే తరహాలో తాఖీదులిచ్చారు. ఈనెల 25 జరిగే విచారణకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా పరమేశ్వరుడికే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో 'చట్టం తన పని తాను చేసుకుపోవడం' సర్వత్రా చర్చనీయాంశమైంది.
భగవంతుడు భూకబ్జా చేశాడా?
రాయ్‌గఢ్ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్‌పుర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిజానిజాలు ఏంటో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మూడు రోజులు విచారణ జరిపింది.
ప్రాథమిక విచారణలో తెలిసిన విషయాల ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు తహశీల్దార్ కార్యాలయం అధికారులు. దాదాపు 10 మందికి నోటీసులు ఇచ్చారు. ఈనెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు(భూమిని ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు.