దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్యకు భక్తులు పూజలు చేస్తూ తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత గజాననుడిని నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే బిహార్ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు. 10 రోజులు మాత్రమే భక్తులకు కనిపిస్తాడు. ఈ పది రోజులు భక్తులు వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తారు. ఎందుకు ఇంతలా ఈ విగ్రహానికి భద్రత కల్పిస్తున్నారు? ఈ విగ్రహంలో ఏముందని ఆలయ పూజారి గోవింద్ రామ్‌ను ఆరా తీయగా.. అసలు విషయాలు చెప్పారు.
ఈ గణేశ్ విగ్రహం 150 ఏళ్ల పురాతనమైనదని పూజారి గోవింద్ రామ్ తెలిపారు. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాలరాయితో తయారు చేసిన ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని.. దొంగల కంట పడకుండా ఉంచేందుకే ఇలా చేస్తున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మందిరంలో వినాయకుడిని ఉంచుతున్నట్లు చెప్పారు.