తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బెయిల్ ఆదేశాల అమలులో ఇంత జాప్యమేల?' - సుప్రీం ధర్మాసనం

'ఈ డిజిటల్​ ప్రపంచంలోనూ.. ఆదేశాలు చేరవేసేందుకు పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం' అని వ్యాఖ్యానించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. బెయిల్​ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోందన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది. సమాచారం చేరవేసేందుకు సురక్షితమైన, వేగవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Supreme Court
సుప్రీం కోర్టు

By

Published : Jul 16, 2021, 5:45 PM IST

బెయిల్​ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. డిజిటల్​ ప్రపంచంలోనూ ఇప్పటికీ ఆదేశాలు చేరవేసేందుకు పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నామని పేర్కొంది. ఆదేశాలను వేగంగా ఆచరణలోకి తీసుకొచ్చేలా.. 'సురక్షితమైన, నమ్మకమైన, గుర్తింపు పొందిన ఛానల్​'ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోందన్న వార్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసింది సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. జులై 8న 13 మంది ఖైదీలకు బెయిల్​ మంజూరు చేయగా.. అమలు చేయటంలో ఉత్తర్​ప్రదేశ్​ అధికారులు జాప్యం చేశారన్న వార్తలను సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. ఉత్తర్వులను వేగంగా, సురక్షితమైన పద్ధతిలో చేరవేసే విధానం అమలుపై రెండు వారాల్లోపు ప్రతిపాదనలు అందించాలని సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్​ను కోరింది.

" ఈ విషయంపై రెండువారాల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్​ను ఆదేశించాం. నెల రోజుల్లో కొత్త విధానం అమలు చేసేందుకు కృషి చేస్తాం. మనం సమాచార, సాంకేతిక ప్రపంచంలో ఉన్నా.. ఆదేశాలను చేరవేసేందుకు ఇప్పటికీ పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం."

- సుప్రీం ధర్మాసనం.

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఇంటర్​నెట్​ కనెక్షన్​ అందుబాటులో ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది ధర్మాసనం. అంతర్జాల సౌకర్యం లేకుండా జైళ్లకు ఆదేశాలను వేగంగా చేరవేయలేమని అభిప్రాయపడింది. ఆగ్రా జైలులోని 13 మంది ఖైదీల విడుదలలో జరిగిన జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాల పత్రాలు అందలేదనే విషయం పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొంది.

ఫాస్టర్​ వ్యవస్థకు రూపకల్పన..!

ఎఫ్​ఏఎస్​టీఈఆర్​​- ఫాస్టర్​( పాస్ట్​ అండ్​ సెక్యూర్​ ట్రాన్స్​మిషన్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్​ రికార్డ్స్​).. వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత జైళ్లు, జిల్లా కోర్టులు, హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు సురక్షితమైన ఛానల్​ ద్వారా చేరవేయటమే ఈ వ్యవస్థ ఉద్దేశమని చెప్పారు. దీని ద్వారా సమయం ఆదా అవటం సహా ఆదేశాల అమలులో జాప్యం జరగబోదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ అమలులో సాయం చేసేందుకు అమికస్​ క్యూరీగా సీనియర్​ న్యాయవాది దుశ్యంత్​ దావేను నియమించింది కోర్టు. దావే, సొలిసిటర్​ జనరల్​ల​ సమన్వయంతో పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనను అందించాలని సెక్రటరీ జనరల్​ను ఆదేశించింది.

ఇదీ చూడండి:'పిచ్చోడి చేతిలో రాయిలా దేశద్రోహ చట్టం!'

ABOUT THE AUTHOR

...view details