BJP Mps Protest: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ మొదటి నుంచి అవమానిస్తోందని ఆరోపించారు.
'దేశంలో గిరిజనులందరినీ అవమానించారు'.. గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే.. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దేశంలో గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలందరినీ ఆయన అవమానించారని అన్నారు. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇరానీ వ్యాఖ్యలను భాజపా సభ్యులు సమర్థించారు. అయితే ఇప్పటికే అధీర్.. క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు.
రాజ్యసభలో గందరగోళం.. ముర్ముపై అధీర్ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుని ఛైర్మన్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ చర్యను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఆందోళనలు చేపడుతున్న ఎంపీలు సభ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. కానీ ఏ ఎంపీ పేరును ఆయన చెప్పలేదు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్.. ముర్ముపై అధీర్ రంజన్ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.