Lokpal complaint: పాలకులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను పౌరులు ఇక ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. ఇంతవరకు తపాలా, ఈ-మెయిల్, వ్యక్తిగతంగా మాత్రమే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేసే వీలు ఉండేది. ఇక నుంచి వారు లోక్‌పాల్ ఆన్‌లైన్ అనే డిజిటల్ వేదిక ద్వారా కూడా అవినీతి ఆరోపణలను దాఖలు చేయవచ్చు. భారతదేశ ప్రప్రథమ లోక్‌పాల్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సోమవారం ఈ వేదికను ప్రారంభించారు. ఇకపై పౌరులు ఎక్కడ నుంచైనా, ఏ సమయంలోనైనా లోక్‌పాల్ ఆన్‌లైన్.గవ్.ఇన్‌లో (lokpalonline.gov.in) తమ ఆరోపణలు నమోదు చేయవచ్చు.
ఫిర్యాదుదారుని పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు. కొత్తగా ప్రారంభమైన లోకాయుక్త ఆన్‌లైన్ పోర్టల్ గురించి పౌరులకు, ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తామని లోకాయుక్తలో న్యాయ సభ్యురాలైన జస్టిస్ అభిలాషా కుమారి చెప్పారు. లోక్‌పాల్ పోర్టల్‌కు ఫిర్యాదు పంపిన దగ్గర నుంచి అది పరిష్కారమయ్యే వరకు ప్రతి దశలో ఏం జరుగుతోందో ఫిర్యాదుదారునికి ఎప్పటికప్పుడు ఈ-మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని వివరించారు.