Lokesh CID Enquiry Questions: సీఐడీ విచారణకు లోకేశ్.. ప్రశ్నలు అడిగేందుకు అధికారుల తర్జనభర్జనలు.. Lokesh CID Enquiry Questions: అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ నారా లోకేశ్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఒకానొక దశలో ప్రశ్నలు అడిగేందుకు అధికారులు తర్జనభర్జన పడగా.. మొత్తం ప్రశ్నలు ఒకేసారి ఇస్తే అన్నింటికీ సమాధానం చెబుతానని లోకేశ్ వారితో అన్నట్లు సమాచారం.
తెలుగుదేశంలో ఏయే హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వంలో ఏ పదవులు చేపట్టారు. అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. టీడీపీలో కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలు చూశానని లోకేశ్ బదులిచ్చారు. కార్యకర్తల సంక్షేమంతో పాటు వారు అనారోగ్యం బారిన పడినప్పుడు అండగా ఉండటం, స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన తోడ్పాటు అందించానన్నారు.
ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని.. పంచాయతీరాజ్ -గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పనిచేశాన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో ఏ బాధ్యతలు నిర్వహించారన్న ప్రశ్నకు.. 2008-13 వరకూ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించానని.. 2013-17 వరకు హెరిటేజ్ ఫుడ్స్ స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేశానని సమాధానమిచ్చారు.
Police Stopped Lunch to Lokesh: లోకేశ్‌కు భోజనం తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
హెరిటేజ్ ఫుడ్స్‌లో పనిచేసిన కాలంలో ఆ సంస్థ మీకు ఎంత చెల్లించేదని సీఐడీ ప్రశ్నించగా.. ఈడీగా పనిచేసినప్పుడు వేతనంతో పాటు లాభాలపై కమీషన్, ఇతర సౌకర్యాలు కల్పించారని లోకేశ్ తెలిపారు. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నప్పుడు.. బోర్డు మీటింగ్‌కు హాజరైనందుకు సిటింగ్ ఫీజు చెల్లించేవారన్నారు.
2017 మార్చి 31 నుంచి హెరిటేజ్ సంస్థకు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నానని ప్రస్తుతం షేర్ హోల్డర్‌ను మాత్రమే అని వెల్లడించారు. హెరిటేజ్ సంస్థలో వ్యక్తిగతంగా మీకు ఎంత శాతం వాటా ఉందన్న ప్రశ్నకు.. దాదాపు 10 శాతం అటూఇటుగా ఉందని లోకేశ్ సమాధానమిచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించి విధాన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారని అధికారులుప్రశ్నించగా.. బోర్డు తీసుకుంటుందని మేనేజ్‌మెంట్ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని లోకేశ్ స్పష్టం చేశారు.
టీడీపీ ఎలక్ట్రోరల్ బాండ్స్ విరాళాలు అవినీతేనా? ఆ బాండ్స్ నిధుల్లో అగ్రస్థానంలో ఉన్న వైసీపీ సంగతేంటీ ?
మంత్రివర్గ ఉప సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారా.. ఉంటే మీతో పాటు సభ్యులుగా ఉన్న ఇతర మంత్రులెవరని సీఐడీ ప్రశ్నించింది. మంత్రివర్గ ఉపసంఘంలో తనతో పాటు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు సభ్యులుగా ఉన్నారని లోకేశ్ బదులిచ్చారు. ఆసమయంలో అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ప్రతిపాదన ఎప్పుడైనా వచ్చిందా అన్న ప్రశ్నకు.. రాలేదని సమాధానం ఇచ్చారు.
మీరు నివసిస్తున్న ఇంటికి సంబంధించి వివరాలను చెప్పాలని సీఐడీ కోరగా.. హైదరాబాద్‌లో సొంతిల్లు ఉందని లోకేశ్ చెప్పారు. ఉండవల్లిలో ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని.. తన తల్లి అద్దె చెల్లిస్తుందని బదులిచ్చారు. లింగమనేని సంస్థకు సంబంధించిన స్థలాన్ని తీసుకున్నారా.. దానికి చెల్లింపులు చేశారా అన్న ప్రశ్నకు.. టీడీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని ఆనుకుని లింగమనేని సంస్థకు ఉన్న కొంత స్థలాన్ని వాస్తు అవసరాల కోసం కొనుగోలు చేశామని.. దానికి చెల్లింపులు చేశామని జవాబిచ్చారు.
Bhuvaneshwari met Yuvagalam volunteers యువగళం వాలంటీర్ల త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం: భువనేశ్వరి
కంతేరులో హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూముల గురించి సీఐడీ వివరాలు కోరగా.. 2014 మార్చి 21న హెరిటేజ్ సంస్థ బోర్డు తీర్మానం మేరకు కంతేరులో ఆ సంస్థ భూమి కొనుగోలు చేసిందన్నారు. భూమి కొనుగోలు కోసం 3 కోట్లు కేటాయించాలని ఆ తీర్మానంలోనే నిర్ణయించారన్నారు.
వ్యాపార విస్తరణ కోసం రాజస్థాన్, హరియాణా, అనంతపురం, చిత్తూరు, ఉప్పల్, బయ్యవరం, పామర్రుల్లో భూములు కొనాలని బోర్డు తీర్మానం చేసిందన్నారు. కంతేరులో కొనుగోలు చేసిన భూమిలో 4.55 ఎకరాలు వివాదంలో ఉందని భావించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విక్రయ దస్తావేజులను రద్దు చేసుకున్నామని.. కంతేరులో ప్రస్తుతం హెరిటేజ్‌కు 9.67 ఎకరాలే ఉందని స్పష్టం చేశారు.
జీవో నెంబర్ 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని సీఐడీ ప్రశ్నించింది. వారంతా కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం ఆదేశాలనే పాటించామని సమాధానమిచ్చారు. చివరగా సీఐడీ అధికారులు తయారు చేసిన వాంగ్మూలంపై లోకేశ్ సంతకం చేయలేదని తెలిసింది.
Pattabhiram Comments on Fiber Net Allegation: చంద్రబాబు, లోకేశ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: పట్టాభిరామ్