Lok Sabha Security Breach Today :లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు కలకలం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు, దర్యాప్తు బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు పార్లమెంట్‌కు చేరుకుని, నిందితులిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఛాంబర్లోకి దూకిన ఇద్దరు నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్‌ను విచారించారు. అలాగే నిందితుల నేపథ్యాన్ని పరిశీలిస్తున్నామని ఐబీ అధికారులు తెలిపారు.
'నిందితులిద్దరి స్వస్థలం కర్ణాటకలోని మైసూర్. నిందితుల్లో ఒకడైన సాగర్ శర్మ బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాగా, సమగ్ర దర్యాప్తు కోసం స్థానిక పోలీసులతో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా నిందితుల ఇళ్లకు వెళ్లారు. నిందితులకు ఏవైనా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నించాం. విజిటర్స్ గ్యాలరీలోకి నిందితులు ప్రవేశించే ముందు వారు వచ్చిన అన్ని చెక్ పాయింట్ల సీసీటీవీల ఫుటేజీలను సేకరించాం.' అని ఐబీ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు.. ఫోరెన్సిక్ బృందం సైతం పార్లమెంట్‌కు చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. అలాగే పార్లమెంట్ బయట స్మోక్ డబ్బాలతో నిరసన చేపట్టిన హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలమ్(42), మహారాష్ట్రకు చెందిన అమోల్ శిందే(25) అనే వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.