Rahul Gandhi Lok Sabha Membership : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు స్టేతో పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించిన నేపథ్యంలో.. నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ సోమవారం సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన్ను సాదరంగా పార్లమెంట్లోని ఆహ్వానించారు. రాహుల్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
'సత్యం, న్యాయం సాధించిన విజయం'
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణను సత్యం, న్యాయం సాధించిన విజయంగా అభివర్ణించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరచడానికి బదులు పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం గెలిచింది.. భారత్ గెలుస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. పార్లమెంట్‌లో దేశ గొంతుకను రాహుల్ గాంధీ వినిపిస్తారని.. నిశబ్దంగా ఉండరని తెలిపారు.
'స్టే మాత్రమే విధించింది'
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ స్పందించారు. 'పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే మాత్రమే విధించింది. అప్పీలు ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉంది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ వల్ల కాంగ్రెస్పార్టీకి పెద్దగా లాభమేమీ ఉండదు.' అని అన్నారు. 'దేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం పరువు నష్టం కేసులో కొన్నాళ్లపాటు స్టే విధించింది. అయితే.. రాహుల్ గాంధీ తనను తాను నిర్దోషిగా ప్రకటించుకోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి అవమానకరం' అని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ విమర్శించారు.