Parliament Session 2023 : పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ షెడ్యూల్ సమయం కంటే చాలా తక్కువ పని చేశాయి. తరచూ వాయిదాలు, ఆందోళనలతో సభలు నిర్ణయించిన సమయం కంటే తక్కువగా నడిచాయి. దీనికి సంబంధించిన వివరాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ గురువారం విడుదల చేసింది.
- లోక్‌సభ షెడ్యూల్ సమయం 133.6 గంటలు కాగా.. 45 గంటలు మాత్రమే సభ నడిచింది
- రాజ్యసభ షెడ్యూల్ సమయం 130 గంటలుగా నిర్ణయించగా.. 31 గంటలు మాత్రమే సభ నడిచింది.
- లోక్‌సభ 34.28 శాతం పనిచేయగా.. రాజ్యసభ కేవలం 24 శాతానికే పరిమితమైంది.
- లోక్‌సభలో క్వశ్చ్యన్ అవర్ 4.32 గంటలు నడవగా.. రాజ్యసభలో కేవలం 1.85 గంటలే కొనసాగింది.
- లోక్‌సభలో సార్వత్రిక బడ్జెట్‌పై చర్చ 14.45 గంటల సాగగా.. 145 మంది ఎంపీలు పాల్గొన్నారు.
- రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ 13.44 గంటలు జరగగా.. 143 మంది ఎంపీలు మాట్లాడారు.
- లోక్‌సభలో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టగా.. ఆరు ఆమోదం చెందాయి. మరో 29 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇచ్చారు.
ఇరు సభలు నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఇరు సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ- జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలన్నీ ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సభాపతి ఓం బిర్లా వారించినప్పటికీ.. ఎంతకూ ప్రతిపక్ష ఎంపీలు వినకపోవడం వల్ల సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన సభా గౌరవాన్ని తగ్గించేలా ఉందని.. నిరంతరం సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభాపతి అభ్యర్థనను పట్టించుకోని విపక్షాలు నిరసనలను కొనసాగించడం వల్ల సభను నిరవధికంగా వాయిదా వేశారు.
రాజ్యసభ ఇదే తరహాలో ఉదయం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. ఫలితంగా నిరవధికంగా వాయిదా పడింది.
'నా 52 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి'
మరోవైపు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అదానీ అంశంపై జేపీసీ విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను మళ్లించేందుకే సభలో ఆందోళనలు చేపట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలతో కలిసి పార్లమెంట్ భవనం నుంచి విజయ్ చౌక్ వరకు 'తిరంగ మార్చ్' నిర్వహించిన ఖర్గే.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కూడా ఖర్గే మాట్లాడారు. బీజేపీ ఎంపీకి ఓ కేసులో మూడేళ్లకు పైగా శిక్ష పడిన 16 రోజుల తర్వాత కూడా అనర్హత వేటు పడలేదని.. కానీ రాహుల్ గాంధీ విషయంలో మాత్రం మెరుపు వేగంతో స్పందించారని దుయ్యబట్టారు.