Parliament Winter Session 2022 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే 6 రోజులు ముందుగానే ముగిశాయి. భారత్-చైనా సరిహద్దులోని తవాంగ్ ఘర్షణపై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. అంతకుముందు.. ఈ సమావేశాల్లో యాంటీ పైరసీ బిల్లుతో సహా ఏడు బిల్లులను ఆమోదం పొందినట్లు ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభ ఉత్పాదకత 97 శాతంగా ఉందన్నారు. మొత్తం 13 రోజులు సమావేశాలు జరిగాయని వెల్లడించారు.
షెడ్యూల్‌కు ముందే శీతాకాల సమావేశాలు సమాప్తం.. 7 బిల్లులకు ఆమోదం - పార్లమెంట్ వింటర్ సెషన్స్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే ముగిశాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో యాంటీ పైరసీ బిల్లుతో సహా ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్.. ఎగువసభ ఉత్పాదకత 102 శాతంగా ఉందన్నారు. 13 రోజుల్లో పెద్దల సభ 64 గంటల 50 నిమిషాలు పనిచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సెషన్లో వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ బిల్లు, ఇంధన సంరక్షణ బిల్లు సహా ఏడు బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ తదితరులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజున సభకు హాజరయ్యారు.
డిసెంబరు 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వరకు జరగాల్సి ఉంది. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కారణంగా సమావేశాలని షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని సభాపతి ఓం బిర్లా అధ్యక్షతన ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు హాజరైన సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సభ పనిదినాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరపాలని పలుమార్లు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వం చర్చకు ఒప్పుకోలేదు.