Rajya Sabha Adjourned: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
Lakhimpur Kheri Case: శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన క్రమంలోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లఖింపుర్పై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ క్రమంలో.. సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ అధ్యక్షుడు పీయూష్ గోయల్ సహా ప్రతిపక్షనేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
"సభ అధ్యక్షుడు సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సభలో జరగాల్సిన చర్చలపై ఎంపీలు ఏకాభిప్రాయానికి రావాలి. దీనిపై మీరు చర్చించేందుకు వీలుగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నాను."
-వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
Lok Sabha Adjourned
లోక్సభ శుక్రవారం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేతలు నిరసనలకు దిగారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓంబిర్లా. అయితే ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.