తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో అదే రగడ- కీలక బిల్లులు పాస్ - పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్​లో మంగళవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. గందరగోళ పరిస్థితుల మధ్యే లోక్​సభలో రెండు, రాజ్యసభ ఓ బిల్లుకు ఆమోదముద్ర పడింది. అనంతరం బుధవారానికి వాయిదా పడ్డాయి. అయితే, సభలో ప్రతిష్టంభనపై వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విపక్షం కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

parliament monsoon session
పార్లమెంట్ సమావేశాలు

By

Published : Aug 3, 2021, 5:18 PM IST

Updated : Aug 3, 2021, 7:46 PM IST

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. విపక్షాల ఆందోళనలు యథావిధిగా కొనసాగాయి. పెగసస్​పై చర్చకు పట్టుబడుతూ సభ్యులు నినాదాలు చేయడం వల్ల ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సాగు చట్టాలు, ధరల పెరుగుదలపైనా చర్చించాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

అంతకుముందు, లోక్​సభలో విపక్షాల ఆందోళనల మధ్యే ట్రైబ్యునల్స్ రీఫార్మ్స్ బిల్లు, అత్యవసర రక్షణ సేవల బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందాయి. ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులను ఆమోదించడాన్ని లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ఖండించారు.

అయితే, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బిల్లులకు సంబంధించి ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం ఇస్తామని చెప్పారు. పార్లమెంట్​లో ఈ తరహా ప్రతిష్టంభన మంచిది కాదని అన్నారు.

పెద్దల సభలోనూ అంతే..

రాజ్యసభలోనూ పరిస్థితి ఇలాగే కొనసాగింది. పెగసస్ స్పైవేర్, రైతుల నిరసనలు సహా ఇతర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సభ్యులు పదేపదే వెల్​లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పలుసార్లు సభ వాయిదా పడింది. సభ్యులు ఎంతకీ శాంతించకపోవడం వల్ల చివరకు బుధవారానికి వాయిదా వేస్తూ.. ఛైర్మన్ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కాలితా నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు.. రాజ్యసభ దివాలా స్మృతి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్షాల రగడ మధ్యే దీనికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు జులై 28నే లోక్​సభ పచ్చజెండా ఊపింది.

వెంకయ్య సూచన

మరోవైపు, పార్లమెంట్​లో ప్రతిష్టంభనపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విపక్షాలు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. రాజ్యసభ తొలిసారి వాయిదా పడిన తర్వాత ఈ మేరకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతోనూ మాట్లాడారు. ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని వెంకయ్య అభ్యర్థించారు. సభలో ఉద్రేక పరిస్థితులను నివారించేలా పరిష్కారానికి రావాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంగళవారం సాయంత్రం సైతం వెంకయ్య ఓ సమావేశాన్ని నిర్వహించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్​ ఈ భేటీకి హాజరైనట్లు వివరించాయి.

ఇదీ చదవండి:

Last Updated : Aug 3, 2021, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details