వర్షాకాల సమావేశాల నిర్దేశిత గడువు ముగియక ముందే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో రెండు రోజుల ముందే దిగువ సభ వాయిదా పడింది.
ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉండగా సభ్యుల ఆందోళనల మధ్య చర్చలకు ఆస్కారం లేకపోయింది. ఫలితంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
సభను వాయిదా వేయడానికి ముందు ఎంపీలు.. ఇటీవలే మరణించిన నలుగురు లోక్‌సభ సభ్యులకు నివాళులర్పించారు.
చాలా బాధగా అనిపించింది..
వాయిదా అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఓం బిర్లా. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడం బాధించిందని తెలిపారు. సభ ప్రతిష్ఠను తగ్గించేలా సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం, ఆందోళన చేయడం సరికాదని అన్నారు.
17 రోజుల పాటు జరిగిన లోక్‌సభ సమావేశాల్లో.. 20 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ పేర్కొన్నారు. వీటిలో ఓబీసీ చట్ట సవరణ బిల్లు సహా, జనరల్ ఇన్సూరెన్స్, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ వంటి ముఖ్యమైన చట్ట సవరణ బిల్లులు ఉన్నట్లు ఓం బిర్లా చెప్పారు.
మొత్తంగా 21గంటల 14 నిమిషాలపాటు జరిగిన లోక్‌సభ సమావేశాల్లో విపక్షాల ఆందోళన మధ్యే ఈ బిల్లులను సభ ఆమోదించింది.
మరోవైపు, నూతన పార్లమెంట్ నిర్మాణం గురించి మాట్లాడిన ఓం బిర్లా.. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి భవనం పూర్తవుతుందని తెలిపారు.