టమోటా సాగు చేసిన రైతులు దిగుబడి చూసి సంతోషించే లోపే.. ధరలు పడిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. కిలో టమోటాకు రెండు, మూడు రూపాయలు కూడా పలకటం లేదు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు తలెత్తాయి. కరోనా సంక్షోభంతో కొనేవారే కరువయ్యారు. ఈ క్రమంలో నిరాశకు గురైన ఓ రైతు తాను సాగు చేసిన 10 ఎకరాల టమోటా పంటకు నిప్పంటించాడు. ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు సమీపంలోని గ్రామంలో జరిగింది.
బెంగళూరు నేలమంగళ సమీపంలోని ఖాజీపాల్య, కుట్టినాగెరే ప్రాంతాల్లోని రైతులు ఈ సారి భారీ ఎత్తున టమోటా సాగు చేశారు. ఈ నేపథ్యంలో మారి గౌడ అనే ఓ రైతు 10ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంట సాగు చేశాడు. మధ్యవర్తులు అన్నదాత వద్ద నుంచి కిలో టమోటాను రూ.5కు కొని, మార్కెట్లో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మారిగౌడ.. తన 10 ఎకరాల్లో పండించిన టమోటా పంటకు నిప్పంటించాడు.
ఎన్నో ఆశలు పెట్టుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర రానందువల్లే.. ఇలా తగులబెట్టినట్టు మారిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.