దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ యోచన చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. పరిస్థితి అదుపు తప్పితే రెండు నుంచి మూడు వారాల పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే అవకాశం ఉందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
"ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిపోయి.. మందుల కొరత అధికంగా ఉంటే అలాంటి చర్యలు తీసుకోవచ్చు." - రాజేశ్ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి
రాష్ట్రంలో కరోనా కేసుల నిర్వహణపై వస్తున్న విమర్శలను ఖండించారు రాజేశ్. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ప్రొటోకాల్స్‌ను కూడా పాటిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో మహారాష్ట్రపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
అఖిలపక్ష భేటీ
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఈ మేరకు ఓ భాజపా నేత తెలిపారు. శుక్రవారమే సమావేశం జరగాల్సి ఉండగా.. ఓ పరీక్ష కారణంగా శనివారానికి వాయిదా వేసినట్లు వెల్లడించారు.
అండమాన్‌లో రాత్రి కర్ఫ్యూ
దక్షిణ అండమాన్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న వేళ ఏప్రిల్ 10 నుంచి నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు అక్కడి అధికారులు.
రూ.5 వేలు జరిమానా
కరోనా తీవ్రత అధికమవుతున్న వేళ.. మాస్కు లేకుండా తిరిగేవారికి విధించే జరిమానా పెంచింది ఒడిశా ప్రభుత్వం. మాస్కు లేకుండా పట్టుబడితే రెండుసార్లు రూ.2వేల జరిమానా విధిస్తారు. మూడోసారి దొరికితే రూ.5వేలు జరిమానా విధిస్తారు. కొవిడ్ నిబంధనలను సక్రమంగా పాటిస్తే లాక్డౌన్ విధించాల్సిన అవసరం రాదని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.