లాక్డౌన్ కారణంగా 2020లో ప్యాసెంజర్ రైళ్లు కొంతకాలం నిలిచిపోయినప్పటికీ ట్రాక్‌పై మరణించినవారి సంఖ్య అధికంగానే నమోదైంది. ఆ ఏడాది 8,733 మంది ట్రాక్‌లపైనే ప్రాణాలు కోల్పోయారని రైల్వే బోర్డు తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందనగా ఈ వివరాలు వెల్లడించింది.
- 2020 జనవరి-డిసెంబర్ మధ్య 8733 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాష్ట్రాల పోలీసుల సమాచారం ప్రకారం 805 మంది గాయపడ్డారు.
- 2016-19 మధ్య 56,271 మంది మరణించారు. 5,938 మంది గాయపడ్డారు.
నాలుగేళ్లలో ఇలా..
ఏడాది | మృతులు |
2016 | 14,032 |
2017 | 12,838 |
2018 | 14,197 |
2019 | 15,204 |
వలస కూలీలే అధికం!
గత నాలుగేళ్లతో పోలిస్తే 2020లో మరణాలు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే రైళ్ల రాకపోకలు కొద్ది కాలం పాటు నిలిచిపోవడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఆ ఏడాది మరణించిన వారిలో చాలా వరకు వలస కూలీలే ఉన్నారని వెల్లడించారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల దారి తెలియక రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ ఎంతో మంది కూలీలు తమ స్వస్థలలాకు వెళ్లారు. లాక్డౌన్లో పోలీసుల కంట పడకుండా ఉండటం సహా రోడ్డు మార్గంతో పోలిస్తే దగ్గరి దారి అనే భావన ఉన్నందున రైల్వే ట్రాక్‌పైనే నడుస్తూ.. తమ ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో ప్రమాదాలు సంభవించి మరణించారని అధికారులు తెలిపారు.