తమిళనాడు కడలూర్ జిల్లా తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయం ముందున్న రోడ్డుపైనే కొన్ని జంటలు వివాహం చేసుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రార్థనా స్థలాలన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడమే ఇందుకు కారణం.
చిన్న తిరుపతి..!
కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకు పైగా వివాహాలు జరుగుతుంటాయి. దీనికోసం వధూవరుల కుటుంబం ఆలయ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఏప్రిల్ 24న బలమైన ముహూర్తం ఉన్నందున ఈ ఆలయంలో వివాహం నిర్వహించడానికి చాలా కుటుంబాలు సిద్ధమయ్యాయి. కానీ ఆలయ మూసివేతతో రోడ్డు మీదే(ఆలయం ముందు) వివాహాలు జరిపించాయి. ఈ సందర్భంగా దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి.