అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణస్వీకారం వేళ తమిళనాడులోని తులసేంద్రపురంలో స్థానికుల సంబరాలు అంబరాన్నంటాయి. కమలాహారిస్ తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తులసేంద్రపురంలో కమల తమ గ్రామానికే గర్వకారణం అంటూ స్థానికులు ముగ్గులు వేశారు. అనేక మంది ఇళ్ల ముందు రంగవల్లులు ఆకట్టుకున్నాయి.
కమలా హారిస్‌కు శుభాకాంక్షలు ప్రమిదలతో కమలా హారిస్ పేరు కమలా హారిస్‌కు మహిళల శుభాకాంక్షలు కమలా హారిస్ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ప్రజలందరూ ఒక చోట చేరి ఆసక్తిగా తిలకించారు. పెద్దలు, పిల్లలు అందరూ ఇందులో పాల్గొన్నారు. కమల హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపూ చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కమలా హారిస్ ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేతబూనిన తులసేంద్రపురం ప్రజలు.... వీధుల్లోకి వచ్చి లాంగ్ లివ్ కమలా అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాసులు కాలుస్తూ సందడి చేశారు. మిఠాయిలు పంచి పెట్టారు. ఇంటి ముందు కమలా హారిస్ అన్న పేరుతో ప్రమిదలు వెలిగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అంతకుముందు కమలా హారిస్‌కు అంతా శుభమే కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారిస్ పదవీకాలం దిగ్విజయంగా సాగాలంటూ అర్చనలు చేశారు.