మాజీ ఉప ప్రధాని, భారతీయ జనత పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ 95వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లిన మోదీ.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడ్వాణీ యోగక్షేమాలు తెలుసుకున్న మోదీ... కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అడ్వాణీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అడ్వాణీని కలిసిన అనంతరం ట్వీట్ చేసిన మోదీ... దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దూరదృష్టితో దేశంలోని అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్నారని ట్వీట్ చేశారు. భాజపాను నిర్మించి, బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అసమానమని అన్నారు.
పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ
భాజపా సీనియర్ నేత ఎల్.కె అడ్వాణీకి ఆ పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి.. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. భాజపాను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అసమానమని మోదీ పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా అడ్వాణీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి ఎనలేని సేవ చేసిన అడ్వాణీకి దీర్ఘాయువు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాననంటూ... అమిత్ షా ట్వీట్ చేశారు. అడ్వాణీ తమకు స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో ఆయన ఓ చుక్కాని అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. పార్టీ నేతలకు ఆయన మార్గదర్శి అన్నారు.
1927లో కరాచీ(ప్రస్తుతం పాకిస్థాన్)లో జన్మించిన అడ్వాణీ.. చిన్నవయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. అనంతరం జనసంఘ్ తరఫున పనిచేశారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో అడ్వాణీ ఒకరు. వాజ్పేయీతో పాటు దశాబ్దాల పాటు భాజపాకు ముఖచిత్రంగా ఉన్నారు. భాజపాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసింది ఈయనే. 1990లో అడ్వాణీ చేపట్టిన రథయాత్ర దేశరాజకీయాల్లో అనూహ్య మార్పునకు నాంది పలికింది. అయోధ్యలో రాముడు జన్మించాడని భావిస్తున్న ప్రాంతంలోనే మందిరం నిర్మిస్తామని ఆయన చేపట్టిన యాత్ర.. భాజపాకు విశేషాదరణ కట్టబెట్టింది. వాజ్పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. అడ్వాణీ హోంమంత్రిగా పనిచేశారు. అనంతరం ఉపప్రధాని పదవిని స్వీకరించారు.