లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) లోక్‌సభాపక్ష నేతగా చిరాగ్ పాసవాన్(Chirag Paswan) వైదొలగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. పశుపతి కుమార్ పరాస్‌ను తమ కొత్త నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్‌లోని హాజీపుర్ లోక్‌సభ స్థానానికి పశుపతి కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"ఎల్జేపీకి చెందిన ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆదివారం కలిశారు. తమ పార్టీలోని నూతన మార్పులకు సంబంధించి ఓ లేఖను ఆయనకు అందజేశారు. పశుపతి కుమార్‌ను తమ కొత్తనేతగా వారు ఎన్నుకున్నారు." అని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ మృతిఅనంతరం.. ఆయన కుమారుడైన చిరాగ్ పాసవాన్(Chirag Paswan) పనితీరుపై ఎల్జేపీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని చెప్పాయి.
ఎల్జేపీకి లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఎంపీలు పశుపతి పరాస్‌ను తమ నూతన నేతగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన ఎల్జేపీలో తాజా పరిణామం.. బిహర్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
'చిరాగ్‌ను వ్యతిరేకించను'
లోక్‌సభ స్పీకర్ ఆదేశించినప్పుడు వెళ్లి తాము ఆయనను కలుస్తామని పశుపతి కుమార్ పరాస్ సోమవారం చెప్పారు. చిరాగ్పాసవాన్పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.