ఎల్జేపీలో ఏకాకిగా మిగిలిన చిరాగ్ పాసవాన్..
ఇటు పార్లమెంటరీ పక్షనేత పదవితో పాటు అధ్యక్ష పదవికి దూరమైన చిరాగ్..
తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెడతారా?
రీల్ లైఫ్‌తో పాటు, రియల్ లైఫ్‌లోనూ విఫలమైన చిరాగ్ ముందున్న దారులేంటి?
బిహార్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఆరుగురు ఎంపీలున్న ఈ పార్టీలో ఐదుగురు ఎంపీలు తిరుగుబావుట ఎగరవేసి..చిరాగ్ పాసవాన్ ఏకాకిని చేశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా తప్పించడమే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. అంతే కాకుండా పార్టీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షునిగా సూరజ్భాన్ సింగ్‌ను నియమించి.. పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను కూడా ఆయనకు అప్పగించారు. చిరాగ్‌కు స్వయనా బాబాయ్ వరుసైన పశుపతి కుమార్ పరాస్.. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి చిరాగ్ నేరుగా పశుపతి ఇంటికి వెళ్లినా ఫలితం దక్కలేదు.
రాంవిలాస్ రాజకీయ వారసత్వాన్ని చిరాగ్ నిలిపేనా?
రాంవిలాస్ పాసవాన్ మరణించి ఏడాది కాకముందే పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. లోక్‌సభలో 10 సీట్లు లేకపోయినా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాంవిలాస్కు మంత్రి పదవి పక్కా. అటువంటి వ్యూహాలు, రాజకీయ చతురతతో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు రాంవిలాస్.
చిరాగ్ తప్పిదాలే పార్టీ విభేదాలకు కారణమా?
అయితే రాంవిలాస్ తదనంతరం పగ్గాలు చేపట్టిన చిరాగ్.. ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలని, పార్టీని ఏకతాటిపై నడిపించాలని శతవిధాల ప్రయత్నించారు. అందుకు తన వ్యూహాలతో భాజపాకు మద్దతు ఇస్తూ.. జేడీయూను కాదని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 136 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ అండతో ఆరు స్థానాలను కైవసం చేసుకున్న ఎల్‌జేపీ.. రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానానికి పరిమితమై చతికిలపడింది.
భాజపా, జేడీయూలకు శత్రువుగా..
వేరుకుంపటి పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు జేడీయూకు, తన ప్రవర్తనతో ఇటు భాజపాకు విరోధిగా మారారు చిరాగ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్‌జేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి.. జేడీయూను ఇరుకున పడేస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. దీంతో సీఎం పదవిపై ఆశలు వదులుకున్న జేడీయూ నేత నితీశ్ కుమార్.. అప్పటికే చిరాగ్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. ఎలాగోలా సీఎం పీఠం అధిరోహించిన నితీశ్.. చిరాగ్‌పై పగతీర్చుకోవాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే పశుపతి తిరుగుబావుట రూపంలో చిరాగ్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
కుటుంబ సభ్యులకీ విరోధే!
తన రాజకీయ వ్యూహాలతో ఓ వెలుగు వెలుగిన రాంవిలాస్ నుంచి వారసత్వం అందిపుచ్చున్నారు చిరాగ్. అయితే రాంవిలాస్ అడుగుజాడల్లో నడవలేకపోయాడు. పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి చిరాగ్ డబ్బులు డిమాండ్ చేసినట్లు రాంవిలాస్ పెద్ద అల్లుడు సాధు పాసవాన్ ఆరోపించారు. అలాగే రాంవిలాస్ మొదటి భార్యకు సంబంధించిన వివాదం కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీ వ్యూహాలతో ఎలాంటి సంబంధంలేని రాంవిలాస్ ఇద్దరు తమ్ముళ్ల మాటలను చిరాగ్ లెక్కచేయలేదు.
ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజా జీవితంలో నిర్వహించాల్సిన విలువలను చిరాగ్ కాపాడలేకపోయారు. ఫలితంగా మొత్తం పార్టీ, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలకు దూరమయ్యారు.
చిరాగ్ ముందున్న అవకాశాలేంటి?
ప్రస్తుత పరిస్థితుల్లో చిరాగ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. అయితే చిరాగ్ ముందున్న ఎలాంటి అవకాశాలున్నాయి?
- ఎల్‌జేపీ పార్లమెంటరీ నేతను పార్టీ ఎంపీలు తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడం. అయితే, ఈ విషయంలో అతనికి పెద్ద ఊరట లభించకపోవచ్చు.
- చిరాగ్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించవచ్చు. కానీ ఆయనకు అక్కడ కూడా పెద్ద ఉపశమనం కలగపోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
- రాజకీయ స్థిరత్వం కోసం ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవచ్చు.
- బిహార్‌లోని తేజస్వీ యాదవ్, చిరాగ్ మధ్య పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది. చిరాగ్‌కు ఉన్న అన్ని మార్గాల్లోకెళ్లా.. ఆర్జేడీతో పొత్తు కుదుర్చుకోవడమే ఉత్తమం. ఇలా చేస్తే.. పశుపతితో పాటు సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తన నిరసన గొంతును గట్టిగా వినిపించవచ్చు.
పాసవాన్ బంధువుల చేతిలోనే పార్టీ
చిరాగ్ చేతిలో నుంచి పార్టీ జారిపోయిన తర్వాత పశుపతి కుమార్ ఎల్జేపీకి కీలక నేతగా మారారు. ఇప్పటికీ ఎల్‌జేపీ.. రాంవిలాస్ బంధువుల చేతిలోనే ఉంది. అయితే తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకోవడానికి, పార్టీని సంక్షోభం నుంచి బయట పడేయడానికి చిరాగ్ ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.
ఇదీ చూడండి:
చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్!